: ప్రపంచదేశాలన్నీ అడ్డుపడినా అణ్వాయుధ పరీక్షలు ఆపేది లేదు: ఉత్తరకొరియా
ప్రపంచదేశాలన్నీ అడ్డుపడినా అణ్వాయుధ పరీక్షలు ఆపేది లేదని ఉత్తరకొరియా తేల్చిచెప్పింది. ఉత్తరకొరియా ఐక్యరాజ్యసమితి ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ, అమెరికా వద్ద ఎన్నో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని అన్నారు. వాటిపై తామెప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన గుర్తు చేశారు. అమెరికా రక్షణలో భాగంగా ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేసుకుందని, అది ఆ దేశం హక్కు అని ఆయన తెలిపారు. అలాంటి హక్కే తమకు కూడా ఉందని ఆయన అన్నారు. అణ్వాయుధ తయారీ అనేది ఒక దేశ అంతర్గత విషయమని ఆయన స్పష్టం చేశారు.
దేశ రక్షణ కోసమే ఏ దేశమైనా అణ్వాయుధాలు తయారు చేసుకుంటుందని ఆయన అన్నారు. అమెరికా ఉత్తరకొరియాను చుట్టుముట్టి 40,000 మంది సైనికులను మోహరించి, తమ మనుగడను ప్రశ్నార్థకం చేసిందని ఆయన తెలిపారు. దీనిని సహించలేకే తాము అణ్వాయుధ తయారీకి మొగ్గుచూపామని ఆయన వెల్లడించారు. ఒక్క బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించినంత మాత్రాన అమెరికా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అయితే హద్దు మీరితే అమెరికాతో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అందుకే ప్రపంచదేశాలతో తమ సంబంధాలు తెంచి, తమను ఒంటరి చేసినా...అణ్వాయుధాల తయారీ ఆపడం మాత్రం కుదరదని ఆయన తేల్చిచెప్పారు.