: ఇక సినిమా థియేటర్లలో విద్యా పాఠాలు... యోచిస్తున్న మానవ వనరుల శాఖ
గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఉపయోగంలో లేని సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో వీడియోల ద్వారా విద్యా పాఠాలు బోధించేందుకు మానవ వనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఐటీ రంగాన్ని నియంత్రించే నాస్కామ్ వారు ఈ ప్రతిపాదన తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ అధికారిక డీటీహెచ్ ఛానల్ అయిన `స్వయం ప్రభ` ద్వారా తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు సినిమా హాల్ మాధ్యమంగా పాఠాలు బోధించే అవకాశం కలుగుతుంది.
ఈ విధానం వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో విద్యార్థులకు పాఠాలు చెప్పే సదుపాయం కలుగుతుంది. సినిమా హాల్ నిరుపయోగంగా ఉండే సమయంలో అంటే ఉదయం 7గం. నుంచి 11గం.ల మధ్య, అలాగే ఆదివారాలు, సెలవుదినాల్లోనూ ఈ పాఠాలు బోధించాలని ప్రతిపాదించారు. ఈ వీడియోల్లో ప్రసారం చేయనున్న పాఠాలను ఐఐటీ ప్రొఫెసర్లు, నిపుణుల పర్యవేక్షణలో రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది.