: మొన్న కోడి రూపంలో... ఇవాళ ఎలుక రూపంలో...శ్వేతసౌధం దగ్గరలో కనువిందు చేస్తున్న ట్రంప్ బెలూన్లు
ఇటీవల వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కి దగ్గరలో ఒక పెద్ద కోడి రూపంలో ఉన్న ట్రంప్ బొమ్మ దర్శనమిచ్చిన సంగతి గుర్తుంది కదా! ఇప్పుడు అలాంటి బెలూన్‌నే మరొకటి ఏర్పాటు చేశారు. ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలుక రూపంలో దర్శనమిచ్చాడు. ట్రంప్‌లాగే ఆహార్యం ప్రదర్శిస్తూ సూట్ వేసుకుని ఉన్న ఈ బెలూన్ను వైట్‌హౌస్‌కు ఓ మైలు దూరంలో ఉన్న డ్యూపొంట్ సర్కిల్లో ఏర్పాటు చేశారు.
ఈ బెలూన్ బొమ్మకు రష్యన్ జెండా పిన్ను కూడా అతికించారు. అధ్యక్షుడి స్థానంలో ఉన్న ట్రంప్ కూడా ఎలుకలాగే మందబుద్ధితో వ్యవహరిస్తున్నారని, అందుకు నిరసనగా ఈ బెలూన్ బొమ్మను తయారుచేసినట్లు దీని సృష్టికర్త జాన్ పోస్ట్ లీ తెలిపాడు. ఈ బొమ్మతో సెల్ఫీలు దిగడానికి అమెరికన్లు ఎగబడుతున్నారు. ట్రంప్ కోడి బొమ్మ కంటే ఈ ట్రంప్ ఎలుక బొమ్మను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది.