: కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు: నిప్పులు చెరిగిన చంద్రబాబు
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఘన విజయం కట్టబెట్టిన కాకినాడ ఓటర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తనపై, టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు అంచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించారని చెప్పారు. టీడీపీ పనైపోయిందంటూ వైసీపీ నేతలు పనిగట్టుకుని ప్రచారం చేసినా, వారిని ప్రజలు నమ్మలేదని అన్నారు. చివరకు కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే సత్తా కేవలం టీడీపీకి మాత్రమే ఉందని చెప్పారు.
టీడీపీ మూడేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని... ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ, పట్టిసీమను పూర్తి చేశామని, రాయలసీమకు కూడా 150 టీఎంసీల వరకు నీటిని అందించామని చంద్రబాబు అన్నారు. పట్టిసీమ ఫలితాలు ఇప్పుడు కనపడుతున్నాయని తెలిపారు. అవినీతిని అరికట్టడానికి టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పారు. బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.