: డోక్లాంలో సైనిక బలగాలను పెంచనున్న చైనా మిలటరీ
భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లాం సరిహద్దులోని ప్రతి అంగుళంలో సైనిక, రక్షణ బలగాలను మోహరిస్తామని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రాంతంలో నిర్మాణాత్మక పనులు చేపట్టడానికి వెనుకాడబోమని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. చైనా దేశ సర్వాధికారాన్ని కాపాడటానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా జాతీయ రక్షణ శాఖాధికారి కల్నల్ రెన్ గువాకియాంగ్ తెలిపారు.
`వివాదం ప్రారంభమైన నాటి నుంచి డోంగ్ లాంగ్ (డోక్లాం) ప్రాంతం మీద చైనా మిలటరీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వివాదానికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు మిలటరీ తన పని తాను చేసుకుపోతుంది` అని రెన్ అన్నారు. చైనా బలగాలు వెనక్కి తగ్గుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. డోంగ్ లాంగ్ ప్రాంతంలోని ఒక్క అంగుళాన్ని కూడా చైనా కోల్పోవడం జరగదని, అది నిజం చేయడానికి చైనా మిలటరీ శాయశక్తుల ప్రయత్నిస్తుందని రెన్ వివరించారు. మిలటరీ వైపు నుంచి కూడా భారత మిలటరీతో కొన్ని ద్వైపాక్షిక చర్చలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రెన్ చెప్పారు.