: ప్రయివేట్ స్కూళ్ల ఆర్థిక వివరాలకు ఓ వెబ్‌సైట్... ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ, కేంబ్రిడ్జి గుర్తింపు పొందిన పాఠశాలలతో పాటు అన్ని ప్రయివేట్, నాన్ ఎయిడెడ్ పాఠశాలలు తమ ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. గత మూడేళ్ల లావాదేవీలతో పాటు పాఠశాలలో పాటించే ఫీజుల విధానాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 15వ తేదీని గడువుగా ప్రకటించింది. ఈలోగా వివరాలు పొందుపరచలేని పాఠశాలలపై చర్య తీసుకోనున్నట్లు తెలిపింది. www.cdse.telangana.gov.in ఈ వెబ్‌సైట్‌లో పాఠశాలలు వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్లుగా ప్రయివేట్ పాఠశాలలు ఫీజులు పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్రవ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రయివేట్ స్కూళ్ల అజమాయిషీని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వెబ్‌సైట్‌లో పొందపరిచే వివరాలు సరైనవేనా? కాదా? అనే విషయంపై స్పష్టత ఎలా వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఈ ఉత్తర్వుకు సంబంధించిన వివరాలు కొన్ని పాఠశాలలకు చేరనట్లుగా తెలుస్తోంది.