: సేవలో వెనుకబడ్డందుకే మావాడు ఓడిపోయాడు: టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు
తన అన్న కుమారుడు స్థానికుడు కాకపోవడం, అక్కడి వైసీపీ అభ్యర్థి స్థానికంగా ఆది నుంచి సేవ చేస్తూ రావడం వల్లే తన అన్న వమనాడి సత్యనారాయణ కుమారుడు శివప్రసాద్ ఓటమి పాలయ్యారని తెలుగుదేశం ఎమ్మెల్యే కొండబాబు విశ్లేషించారు. అతను ఓడిపోవడం వల్ల తానేమీ బాధపడటం లేదని తెలిపారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన కొండబాబు, అక్కడ నలుగురు పోటీ పడ్డారని, వారిలో స్థానికేతరుడు కావడమే శివప్రసాద్ కు మైనస్ అయిందని అన్నారు.
చివరి వరకూ తెలుగుదేశం అభ్యర్థిని అక్కడ నిలబెట్టడంలో విఫలమై, పోటీ పెట్టాలన్న ఉద్దేశంతో తన అన్న కుమారుడిని దింపామని అన్నారు. అయినప్పటికీ కాకినాడ తమకు లభించిందని, ఈ విజయంలో, ఓ డివిజన్ పరాజయం తమకు అసంతృప్తిని కలిగించడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో 22వ డివిజన్ ను అభివృద్ధి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు.