: తూర్పు టెక్సాస్ ను తక్షణం ఖాళీ చేయండి.. లేకపోతే చచ్చిపోతారు!: అమెరికా హెచ్చరికలు
అమెరికాను హార్వే హరికేన్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు టెక్సాస్ వాసులకు ప్రభుత్వ అధికారులు ‘‘ వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. గత వారం రోజులుగా తూర్పు టెక్సాస్ పై హార్వే హరికేన్ విరుచుకుపడి, కకావికలం చేసింది. వారం రోజుల్లో 132 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే వరుణుడు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో ఊహించుకోవచ్చు. దీంతో హూస్టన్ నగరం సముద్రాన్ని తలపిస్తోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం 82 అడుగులకు చేరింది.
టేలర్ కౌంటీలోని నిషెస్, స్టీన్ హేగెన్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. ఈ గేట్లు ఎత్తేస్తే ఆ నీరు ఊళ్లను ముంచెత్తనుంది. దీంతో తక్షణం ఆ ఊళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అలా కాకుండా అక్కడే ఉంటే బతికే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం టెక్సాస్ లోనే 12 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 48,700 ఇళ్లు ధ్వంసమయ్యాయని, వెయ్యేళ్లకోసారి ఇలాంటి వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.