: తమిళనాట అస్థిర పరిస్థితులపై కేంద్రం దృష్టి.. అసెంబ్లీ సుప్త చేతనావస్థకు నిర్ణయం!


తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే, టీటీవీ దినకరన్ వర్గాల మధ్య వర్గ పోరు మరింత ముదరడంతో కేంద్రం రంగంలోకి దిగింది. తమిళనాట అస్థిర పరిస్థితులు ఏర్పడడంతో అసెంబ్లీని కొన్నాళ్లు సుప్త చేతనావస్థలో ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 135 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 22 మంది దినకరన్ వర్గంలో చేరడంతో సంక్షోభం మరింత ముదిరింది. పళని సర్కారు బలం 113కు తగ్గి మైనారిటీలో పడింది. ప్రభుత్వం నిలబడాలంటే పళని వర్గానికి ఇంకా ఐదుగురు శాసనసభ్యులు అవసరం.

మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్వహించిన కీలక సమావేశానికి 28 మంది శాసన సభ్యులు డుమ్మా కొట్టారు. వీరంతా దినకరన్ మద్దతుదారులై ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో కంగారు పడిన పళనిస్వామి వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలపై దృష్టి సారించిన కేంద్రం అస్థిర పరిస్థితులను కొనసాగించడం కంటే శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచడమే మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని వారాలు, లేదంటే 2019 సాధారణ ఎన్నికల వరకు అలాగే కొనసాగించాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News