: రేపే కాకినాడ కార్పొరేషన్ ఫలితాలు.. కౌంటింగుకి ఏర్పాట్లు పూర్తి!


కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా, 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 14 డివిజన్లకు సంబంధించిన 1వ నెంబర్ ఈవీఎంలను తొలుత లెక్కిస్తారు. కొన్ని డివిజన్లకు సంబంధించిన ఫలితాలు 3 రౌండ్లలోనే వెలువడే అవకాశం ఉంది. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 14 డివిజన్ల ఫలితాలు తెలియనున్నాయి. ఒక్కో రౌండ్ కు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టవచ్చని, ప్రతి గంటకు సగటున 14 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా.

కాగా, ఈ నెల 29న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 డివిజన్లు ఉండగా, 48 డివిజన్లకే పోలింగ్ జరిగింది. హైకోర్టులో విచారణ కారణంగా మిగిలిన రెండు డివిజన్లకు పోలింగ్ నిర్వహించలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలసి పోటీ చేశాయి. టీడీపీ 39 డివిజన్లలో, బీజేపీ 9 డివిజన్లలో బరిలోకి దిగగా, వైసీపీ 48 డివిజన్లలోనూ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 17 చోట్ల, సీపీఐ, సీపీఎం రెండు చోట్ల, బీఎస్పీ 3 చోట్ల పోటీ చేశాయి. మొత్తంగా 48 డివిజన్లలోనూ బరిలోకి దిగిన అభ్యర్థుల సంఖ్య 241. ఇదిలా ఉండగా, నంద్యాల ఉపఎన్నిక ఫలితమే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News