: విషం తాగి చనిపోయే ముందు సెల్ఫీ దిగిన యువతులు!
విషం తాగి చనిపోయే ముందు సెల్ఫీ దిగిన ఇద్దరు యువతుల విషాద సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇండోర్ లోని గురునగర్ ప్రాంతానికి చెందిన రచన, తన్వి అనే ఇద్దరు యువతులు ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారు. ఇద్దరూ కలసి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివాహితురాలైన రచన తన భర్త నుంచి వేరుపడింది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఓ గదిలో అద్దెకు ఉంటోంది. తనకు భర్త అంటే ఇష్టం లేదని, తాను చనిపోయాక తన కుమారుడిని తన తల్లిదండ్రులే చూసుకోవాలని కోరుతూ తన సూసైడ్ నోట్ లో పేర్కొంది.
మరో యువతి తన్వి మాత్రం తనకు జీవితంపై విరక్తి కలిగిందని, అందుకే, చనిపోతున్నానంటూ తన సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ లేఖలు రాసిన వీళ్లిద్దరూ కాఫీ కప్పులలో విషం పోసుకుని తాగి రచన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, చనిపోయే ముందు, విషం ఉన్న కప్పులతో సెల్ఫీ దిగారు. ఈ విషయం ఎలా బయటపడిందంటే.. రచన, తన్వి ఇద్దరూ నేలపై నిర్జీవంగా పడి ఉండటాన్ని ఈ రోజు ఉదయం ఆ గదిలోకి వెళ్లిన ఇంటి యజమాని గుర్తించాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించాడు. పోస్టుమార్టం నిమిత్తం వారి మృతదేహాలను తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.