: సంజయ్ దత్ `ద గుడ్ మహారాజా` ఫస్ట్‌లుక్ విడుదల
జైలు నుంచి వచ్చాక బాలీవుడ్ హీరో సంజయ్ దత్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన `భూమి` సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధంగా ఉంది. `భూమి`కి దర్శకత్వం వహించిన ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్న మరో చిత్రంలో సంజయ్ నటిస్తున్నారు. ఈ సినిమా పేరు `ద గుడ్ మహారాజా`. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.
ఇందులో సంజయ్‌దత్ బ్రిటీష్ ఇండియాలోని నవనగర్ రాజ్యాన్ని పాలించిన మహారాజా జామ్ సాహిబ్ దిగ్విజయ్ సిన్హాజీ రంజిత్‌సిన్హాజీ పాత్రలో నటిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వంద మందికి పైగా పోలాండ్ చిన్నారులకు ఈ మహారాజు ఆశ్రయం కల్పించారు. ఇదే కథాంశంతో సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు సంజయ్‌దత్ తో `మలంగ్` అనే మరో సినిమాను కూడా తీసేందుకు ఒమంగ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.