: డేరా బాబా తన ఎర్రబ్యాగ్ తో సిగ్నల్ ఇచ్చాడట!


అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. గత సోమవారం గుర్మీత్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. అంతకుముందు, గుర్మీత్ అనుచరుల అల్లర్ల నేపథ్యంలో గుర్మీత్ ను కోర్టు దోషిగా నిర్ధారించిన విషయాన్ని చాలా సేపటి వరకు గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ, తనను దోషిగా తేల్చిన విషయం గుర్మీత్ అనుచరులకు తెలిసింది. ఈ విషయం ఆయన అనుచరులకు ఎలా తెలిసిందనే అంశమై హర్యానా ఐజీ కేకే రావు మాట్లాడుతూ, పంచకుల సీబీఐ కోర్టులో తీర్పు వెలువడగానే గుర్మీత్ ను కోర్టు వెలుపలికి తీసుకొచ్చామని, సరిగ్గా ఆ సమయంలోనే గుర్మీత్ తన కారులో ఉన్న ఎర్ర బ్యాగును ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని చెప్పారు.

ఆ బ్యాగ్ లో తన బట్టలు ఉన్నాయని, సిర్సా నుంచి తనతో పాటు తెచ్చుకున్నానని చెప్పారని అన్నారు. అయితే, ఆయన ఆ ఎర్రబ్యాగ్ తీసుకోవడం ద్వారా తనను దోషిగా తేల్చారనే విషయాన్ని గుర్మీత్ తన అనుచరులకు తెలియజేశారని అన్నారు. కోర్టు నుంచి బయటకు వచ్చాక వాహనంలో కూర్చునేందుకు కూడా గుర్మీత్ కొంత సమయం తీసుకున్నాడని, చేతిలో ఉన్న బ్యాగ్ తో కారిడార్ లో తిరుగుతూ కన్పించాడని చెప్పారు. దీని వల్ల తన అనుచరులకు అసలు విషయం తెలుస్తుందని అనుకున్నారని, వారు అల్లర్లు సృష్టించి తనను అక్కడి నుంచి తప్పిస్తారని భావించారని కేకే రావు అన్నారు. ఈ విషయం తమకు అర్థం కావడంతో జాగ్రత్త పడ్డామని, గుర్మీత్ ను తరలించేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే, గుర్మీత్ ను హెలిపాడ్ కు తీసుకువెళ్లే దారిలో అతడి అనుచరులు 70 వాహనాల్లో వేచి ఉన్నారని, దీంతో, వెంటనే వేరే మార్గం ద్వారా ఆయన్ని హెలిపాడ్ వద్దకు తీసుకువెళ్లామని కేకే రావు తెలిపారు.

  • Loading...

More Telugu News