: ముహూర్తం కుదిరినట్టే... 2న మోదీ కేబినెట్ విస్తరణ?
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మోదీ మంత్రివర్గ విస్తరణపై చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గోవా సీఎంగా వెళ్లిపోవడం, మరో మంత్రి మరణించడం, రవాణా వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలన్న ఆలోచన, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యు) వంటి కొత్త మిత్రులకు స్థానం కల్పించడం లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలసి చర్చలు సాగించిన మోదీ, విస్తరణకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం.
ప్రస్తుతం ఆర్థిక, రక్షణ శాఖలు అరుణ్ జైట్లీ ఒక్కరే చూస్తుండటంతో, ఆయనపై కొంత భారాన్ని తొలగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉపరితల రవాణా శాఖా మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీకి మిగతా రవాణా వ్యవస్థల బాధ్యతలనూ అప్పగించనున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు రక్షణ శాఖను అప్పగించి, జనతాదళ్ నుంచి తీసుకునే ఎంపీకి రైల్వే శాఖను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ నుంచి కనీసం ఇద్దరికి మోదీ కేబినెట్ లో చోటు దక్కవచ్చని సమాచారం. ఇదిలావుండగా, అన్నాడీఎంకేలో కొనసాగుతున్న సంక్షోభం కేబినెట్ విస్తరణకు బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.