: బీహార్ వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు సాయం చేసిన అమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, వరదలతో అతలాకుతలం అయిన బీహార్ ప్రజల సహాయార్థం రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేశారు. గతంలో వరద బాధితులకు సహాయం చేయాలని కోరుతూ అభిమానులకు ట్విట్టర్‌లో ఓ వీడియో ద్వారా అమీర్ సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ. 25 లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కార్యాలయానికి అమీర్ కొరియర్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది.
ఇటీవల అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా వరద బాధితుల సాయం కోసం రూ. 25 లక్షలను అమీర్ పంపించారు. అందుకుగాను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ట్విట్టర్ ద్వారా అమీర్‌కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. బిహార్‌లోని దర్భాంగ జిల్లా వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రాంతంలోని దాదాపు 22 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమైనట్లు సమాచారం. అలాగే ముజఫర్‌నగర్, సమస్తిపూర్ ప్రాంతాల ప్రజల పరిస్థితి కూడా వరదల కారణంగా అగమ్యగోచరంగా మారింది.