: హృతిక్ వల్ల నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను.. అతను నాకు క్షమాపణ చెప్పాలి: కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో వివాదాల రాణిగా పేరుగాంచిన కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల టీవీలో వస్తున్న ఓ కార్యక్రమం ప్రోమోలో పేరు చెప్పకుండా ఓ హీరో తనకు క్షమాపణలు చెప్పాలని అనడం బాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ మాటలు హృతిక్‌ని ఉద్దేశించి అన్నవేనని మీడియా అనుకునేలోపే ఓ ట్వీట్ ద్వారా హృతిక్ రోషనే స్వయంగా ఓ హింట్ ఇచ్చాడు.
ఇంతకీ ప్రోమోలో కంగనా ఏమన్నదంటే....`అతన్ని ఇక్కడికి పిలవండి. ప్రతి ప్రశ్నను అతన్ని అడగండి. మొదట నోటీసు పంపింది నేను కాదు. అంత నీతిమాలిన పని నేను చేయలేదు. ఆ నోటీసు వల్ల రాత్రుళ్లు నాకు నిద్రపట్టేది కాదు. ఒత్తిడి, మానసిక వేదన వల్ల ఎంతో నరకయాతన అనుభవించాను. నా పేరు మీద అతను మెయిల్స్ కూడా విడుదల చేశాడు. ఇప్పటికీ వాటిని జనాలు చదివి, నా మీద జోకులు వేస్తున్నారు. నన్ను ఇంత ఇబ్బందికి గురి చేసినందుకు అతను నాకు క్షమాపణలు చెప్పాలి` అంది. ఈ నేపథ్యంలోనే హృతిక్ చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసింది. `మీడియా చెబుతున్న మహిళతో కంటే పోప్‌తో ఎఫైర్ పెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను` అంటూ హృతిక్ ట్వీట్ చేయడంతో ఆ మాటలు అతన్ని ఉద్దేశించి అన్నవేనని స్పష్టం చేసినట్లయింది.