: లక్షణమైన నా కథను పోర్న్ సినిమాలా తయారు చేసి రిలీజ్ చేశారు: 'అర్జున్ రెడ్డి' సినిమాపై డైరెక్టర్ నాగరాజు ఆరోపణ


'అర్జున్ రెడ్డి' సినిమా నాది అంటున్న 'ఇక సె..లవ్' చిత్ర దర్శకుడు నాగరాజు ఆ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇక సె..లవ్' ఫీచర్ ఫిల్మ్ నుంచి 'అర్జున్ రెడ్డి' కథను చోరీ చేశారని ఆయన తెలిపాడు. కథాచౌర్యం చేసి, అలాంటి ఆలోచనే తమకు వచ్చిందని చెబుతున్నారని మండిపడ్డాడు. లక్షణమైన తన కథను ముద్దులు, హద్దులు మీరిన సన్నివేశాలతో పోర్న్ సినిమాలా తయారు చేసి, రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను తీసింది షార్ట్ ఫిల్మ్ కాదని, తాను తీసింది ఫీచర్ ఫిల్మ్ అని ఆయన స్పష్టం చేశాడు. తన వెనుక పెద్ద హీరో లేడు, పెద్ద బ్యానర్ లేదు, భారీగా ఖర్చు చేసే నిర్మాతలు, వివాదం చేసే వ్యక్తులు, ట్వీట్లు చేసే రాంగోపాల్ వర్మ లేరని ఆయన అన్నాడు.

తాను ఈ కథను అల్లు అరవింద్, బెల్లంకొండ సురేష్, మారుతి వంటి వారికి చూపించానని ఆయన చెప్పాడు. పచ్చి బూతులతో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు, థియేటర్లు దొరుకుతాయి, సినీ పరిశ్రమ మొత్తం దాని వెంట నిలబడుతుందని తెలిపాడు. రీమేక్ సినిమాను కూడా మక్కీకిమక్కీ చేయలేరని ఆయన చెప్పాడు. ఏవో కొన్ని మార్పులు ఉంటాయని, అవే మార్పులు 'అర్జున్ రెడ్డి'లో కూడా చోటుచేసుకున్నాయని ఆరోపించాడు. కథ, కథనం, కథాగమనం మొత్తం తనవేనని తెలిపాడు. నిర్మాతలు రాజీకి వచ్చి రూ. 2 కోట్ల పరిహారం ఇస్తే సరేనని, లేని పక్షంలో చట్టపరంగా పోరాడుతానని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News