: ఒకసారి ఎంటరైతే తప్పించుకునే సమస్యే లేదు... 'బ్లూవేల్'పై లేఖ రాసి యువకుడి ఆత్మహత్య
ప్రమాదకర స్మార్ట్ ఫోన్ గేమ్ 'బ్లూవేల్' మరో ప్రాణాన్ని బలిగొంది. ఈ దఫా బాధితుడు మధురైకి చెందిన 19 ఏళ్ల యువకుడు. ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆడుతున్న విగ్నేష్, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఓ లేఖ రాస్తూ, "బ్లూ వేల్ - ఇదో ప్రమాదకరమైన ఆట. ఒకసారి ఎంటర్ అయితే, ఎన్నటికీ బయటకు వెళ్లలేరు" అని తనువు చాలించాడు. ఓ ప్రైవేటు కాలేజీలో రెండో సంవత్సరం కామర్స్ విద్యను అభ్యసిస్తున్న విగ్నేష్, గత కొంతకాలంగా ఎక్కువ సేపు ఫోన్ తోనే గడుపుతున్నాడని అతని స్నేహితులు పోలీసు విచారణలో వెల్లడించాడు.
తమిళనాడులో బ్లూవేల్ గేమ్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదే. ఇప్పటికే ముంబై, ఉత్తర ప్రదేశ్, కేరళ తదితర ప్రాంతాల్లో పలువురు మృత్యువాత పడగా, చాలా రాష్ట్రాలు ఈ గేమ్ ను నిషేధించాయి. రష్యాలో పుట్టిన ఈ గేమ్ ఇప్పటివరకూ సుమారు 100 మందిని పైగా బలిగొంది. టీనేజర్లు, ముఖ్యంగా చిన్నారులు ఈ గేమ్ కు అలవాటు పడి ఆత్మహత్య ఆలోచనవైపు వెళుతున్నారు. ఓ ప్రైవేటు చాట్ మోడ్ ఆధారిత గేమ్ లో, చేతులు కోసుకోవడం, ఒంటరిగా ఉండటం, స్మశానాల్లో గడపడం, హారర్ సినిమాలు చూడటం వంటి 50 టాస్కులు ఉంటాయి. వీటికి సంబంధించిన సెల్ఫీలను అప్ లోడ్ చేస్తుండాలి. భవంతి పైనుంచి దూకాలన్న టాస్క్ లో భాగంగా పలువురు మరణిస్తున్న పరిస్థితి. ఈ గేమ్ కు ఓ ప్రత్యేక సైట్ గానీ, యాప్ గానీ లేకపోవడంతో దీన్ని ఆడుతున్న వారి ట్రాకింగ్ క్లిష్టమైన పనని సైబర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.