: మంత్రులకు రహస్యంగా ఫోన్లు చేస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు... పార్టీ మారేందుకు వినతులు!
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తరువాత, పలువురు వైకాపా ఎమ్మెల్యేలు తాము అధికార తెలుగుదేశంలోకి వస్తామని ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ మంత్రే స్వయంగా వెల్లడించారు. నిన్న తన ఆఫీసులో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్న వేళ, రాయలసీమకు చెందిన ఓ వైకాపా ఎమ్మెల్యే నుంచి ఫోన్ రాగా, మంత్రి లోపలికి వెళ్లి దాదాపు 20 నిమిషాల పాటు మంతనాలు చేసి వచ్చారు. ఆపై ఆయన పేరు చెప్పని సదరు మంత్రి, టీడీపీలోకి వచ్చేందుకు ఓ ఎమ్మెల్యే ఆసక్తిగా ఉన్నాడని, ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి వచ్చేటప్పుడు చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ఆపనే జరుగుతోందని అన్నారు. త్వరలోనే శుభవార్త వింటారని ఆయన అనడం గమనార్హం.
ఇక మరో మంత్రి చాంబర్ లోనూ ఇదే తరహా ఘటన జరుగగా, ఆ వెంటనే ఇద్దరు మంత్రులూ పార్టీ నాయకత్వానికి విషయాన్ని చేరవేసేందుకు హుటాహుటిన బయలుదేరారు. ఇక జగన్ వర్గం ఎమ్మెల్యేలు తమ తలుపులు తడుతున్నారని, తాము కూడా అన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న వైకాపా సీనియర్లు, పార్టీ ఫిరాయించే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలను కలిసి బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.