: ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్‌కు మరో షాక్.. జీవిత శిక్షను సమర్థించిన హైకోర్టు!
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) మాజీ ఎంపీ మొహమ్మద్ షాబుద్దీన్‌కు హైకోర్టు షాకిచ్చింది. రెండు హత్యకేసుల్లో ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. 2015లో ఓ హత్యకేసులో కింది కోర్టు షాబుద్దీన్‌కు జీవిత కాల శిక్ష విధించింది. షాబుద్దీన్ ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులోనూ అతనికి చుక్కెదురైంది. కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. 2004లో చంద్రశేఖర్ ప్రసాద్ అలియాస్ చందబాబుకు చెందిన ఇద్దరు కుమారులను అపహరించిన షాబుద్దీన్ వారిని హత్య చేశాడు. ఈ కేసులో దోషిగా తేలిన అతడికి కింది కోర్టు జీవిత కాల శిక్ష విధించింది. తన ఆస్తిని చేజిక్కించుకునేందుకు షాబుద్దీన్ చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నందుకే... షాబుద్దీన్ తన కుమారులను హత్య చేశాడని చందబాబు ఆరోపించారు.