: నేటి వన్డేతో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పనున్న ధోనీ.. మూడోది కూడా!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేటి వన్డేతో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పనున్నాడు. శ్రీలంకతో నేడు నాలుగో వన్డే జరగనుంది. వికెట్ కీపర్, స్పెషలిస్టు బ్యాట్స్ మన్ గా జట్టులో స్థానం సంపాదించిన ధోనీ నేటి వన్డేతో తన కెరీర్ లో 300 మ్యాచ్ లు ఆడిన వ్యక్తిగా రికార్డు పుటలకెక్కనున్నాడు. వికెట్ కీపర్ కు ఇది సుదీర్ఘ కెరీర్ కావడం విశేషం. అలాగే ధోనీ ఇప్పటి వరకు 99 స్టంపింగ్స్ చేసి సంగక్కరను రికార్డును సమం చేశాడు. మరొక్క స్టంపింగ్ చేస్తే అత్యధిక స్టంపింగులు చేసిన రికార్డే కాకుండా మూడంకెల స్టంపింగ్ లను చేసిన తొలి వికెట్ కీపర్ గా ధోనీ అవతరిస్తాడు. బ్యాటింగ్ సమయంలో ధోనీ నాటౌట్ గా ఉంటే... అత్యధిక మ్యాచ్ లలో నాటౌట్ గా నిలిచిన ఆటగాడిగా కూడా రికార్డు పుటలకెక్కుతాడు. ఇప్పటికే ధోనీ ఖాతాలో లెక్కలేనన్ని రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే.