: పది కోట్లతో తెలుగు వ్యక్తి కువైట్ నుంచి పరార్!
కువైట్ లో ప్రవాస భారతీయులు, ఇతరులకు పది కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టిన తెలుగు వ్యక్తి పరారయ్యాడని ఆరోపిస్తున్నారు. కువైట్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, విరాళాలివ్వడం ద్వారా బాగా పేరు సంపాదించుకున్న సదరు వ్యక్తి... స్నేహితులు, ప్రవాస భారతీయులు, స్థానికులకు సంబంధించిన 1.6 మిలియన్ దినార్లతో పరారైనట్టు చెబుతున్నారు. ఆయన ప్రముఖ కాంట్రాక్టింగ్ సంస్థకు సామాన్లు సరఫరా చేసేవారని చెబుతున్నారు.
అయితే ఆయనకు రావాల్సిన బిల్లులు సకాలంలో రాలేదని, దీంతోనే ఆయన ఒత్తిడి తట్టుకోలేక పరారయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన పారిపోలేదని, తిరుపతిలోనే ఉన్నారని వారు చెబుతున్నారు. ఆయన తిరుపతికి వెళ్లే ముందు 35,000 దినార్లు చెల్లించారని వారు గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో ఆయన తిరిగి వస్తారని, పైసలతో సహా చెల్లిస్తారని వారు పేర్కొంటున్నారు. అయితే ఆయన వడ్డీ వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో సుమారు 5 మిలియన్ల దినార్లు వసూలు చేసి పరారయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు ఛేదించేందుకు కువైట్ పోలీసులు ఇంటర్ పోల్ ని ఆశ్రయించాలని భావిస్తున్నారు.