: సినీ నటి భావనను ఎవరు వేధించమన్నారో పల్సర్ సునీ చెప్పేశాడు...!
ప్రముఖ సినీ నటి భావనపై లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడమన్నారో ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ ఎట్టకేలకు బయటపెట్టేశాడు. నిన్నమొన్నటి వరకు తనకు మేడమ్ చెప్పారని చెబుతూ వచ్చిన పల్సర్ సునీని నిన్న ఎర్నాకుళం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద మీడియా పల్సర్ సునీకి మేడమ్ ఎవరు? భావనపై లైంగిక దాడి చేయాలని ఆదేశించింది ఎవరు? ఎంత డబ్బులు తీసుకున్నావు? అంటూ పలు ప్రశ్నలు సంధించింది. దీంతో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన పల్సర్ సునీ...‘‘నేను దొంగని కదా? ఒక దొంగ చెప్పే విషయాల్ని ఎందుకు వింటున్నారు?’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. తరువాత ‘‘మా మేడమ్ కావ్య. ఈ విషయం ఇదివరకు మీకు చెప్పలేదా?’’ అని అడిగాడు.
దీంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టైంది. ఈ దారుణానికి పాల్పడమని పురమాయించింది దిలీపేనని స్పష్టమవుతోంది. కావ్యామాధవన్ గతంలో పల్సర్ సునీ ఎవరో తెలియదు అని వ్యాఖ్యానించిన తరువాత, ఆమె వద్ద అతను డ్రైవర్ గా పని చేశాడనే సమాచారం బయటకు వచ్చింది. ఆ తరువాత దిలీప్ చెప్పడంతో పల్సర్ సునీకి రూ. 25,000 ఆమె ఇచ్చిందనే విషయం పోలీసు విచారణలో వెల్లడైంది. గతంలో మేడమ్ తనకు డబ్బులిచ్చారని, అయితే అప్పుడు భావనపై దాడి కోసం తనకు ఆమె డబ్బులిస్తోందనే సంగతి తెలియదని పల్సర్ సునీ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతను చేసిన వ్యాఖ్యలు... ఈ కుట్ర కేసులోని రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో ఇప్పటికే జైలులో ఉన్న దిలీప్ కు ఇది శరాఘాతమే.