: ఏం సాధించారని కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ పురస్కారం ఇస్తున్నారు?: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అనే సంస్థ కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ పురస్కారం ఇస్తోందని, కేసీఆర్ ఏం చేశారని ఆ అవార్డును ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అంతేగాక ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, మరోవైపు గవర్నర్ కూడా కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ప్రకటన చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అందుకే కేసీఆర్‌కి ఈ పురస్కారం ఇస్తున్నారా? అని మండిపడ్డారు.
రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి పడిపోతోందని, రైతుల రుణమాఫీ వడ్డీని ప్రభుత్వం చెల్లించడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చి పంటకు సరైన మద్దతు ధర రావడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటే కేసీఆర్ ప్రభుత్వం వారికి బేడీలు వేసిందని ఆయన విమర్శించారు.