: టీఆర్‌ఎస్ సమావేశంలో బాహాబాహీ!
ఖమ్మం జిల్లాలోని మధిరలో ఈ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పార్టీ మధిర నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు మాట్లాడుతూ... రాష్ట్ర సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు జరగాలంటే టీఆర్ఎస్ కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. దీంతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ కి చిర్రెత్తుకొచ్చింది. వేరే పార్టీల నుంచి వచ్చిన కొందరు అభివృద్ధి జరగటంలేదని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇష్టం లేనివారు బయటకు వెళ్లవచ్చని వ్యాఖ్యానించారు.
దీంతో అక్కడి కార్యకర్తలు వాగ్వివాదానికి దిగి, ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని కొట్టుకున్నారు. బేగ్ క్షమాపణ చెప్పాలని కొందరు డిమాండ్ చేశారు. ఎంపీ పొంగులేటి వారికి నచ్చజెప్పడంతో సమావేశం మళ్లీ కొనసాగింది.