: విడుదలకు ముందే విజయ్ `మెర్సాల్` రికార్డులు... నిన్న ట్విట్టర్ ఎమోజీ, ఇవాళ ట్రేడ్ మార్క్!
దక్షిణభారత సినీ చరిత్రలో సినిమా పేరుకు ట్రేడ్ మార్క్ సంపాదించిన మొదటి చిత్రంగా విజయ్ `మెర్సాల్` చిత్రం నిలిచింది. గతంలో ట్విట్టర్ ఎమోజీని సంపాదించిన మొదటి చిత్రంగా కూడా `మెర్సాల్` నిలిచిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే మార్కెటింగ్ ద్వారా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోందని తమిళ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ ట్రేడ్‌మార్క్ హక్కుల ప్రకారం ఎవరైనా `మెర్సాల్` టైటిల్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటే చిత్ర నిర్మాతలకు అందుకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. టైటిల్‌ను ముందే ట్రేడ్‌మార్క్ చేసుకోవడం వల్ల సినిమా విడుదలయ్యాక టైటిల్ తమదంటూ ఎవరూ ముందుకు వచ్చే అవకాశం ఉండదని చిత్రనిర్మాణ బృందం పేర్కొంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలకానుంది. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశాడు. అతని సరసన సమంత, కాజల్, నిత్యామీనన్‌లు నటించారు.