: శుభవార్త... ఆధార్ అనుసంధానం గడువు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం


సంక్షేమ పథకాల లబ్ధిని పొందాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరని, అయితే, ప్రజల సౌకర్యార్థం అనుసంధానానికి గడువును సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31కి పొడిగిస్తున్నామని మోదీ సర్కారు నేడు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అంతకుముందు ఆధార్ అనుసంధానంపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ లతో కూడిన ధర్మాసనం ముందు కేంద్రం తన వాదన వినిపిస్తూ, సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా చూడటమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.

అనుసంధానం గడువును మూడు నెలలు పొడిగిస్తున్నట్టు చెప్పడంతో, ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని భావించిన ధర్మాసనం, అన్ని పిటిషన్లపైనా నవంబర్ తొలి వారంలో విచారణ ప్రారంభిస్తామని చెబుతూ, కేసును వాయిదా వేసింది. పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News