: తమ్ముడిని కాపాడుకున్న రియల్ హీరో కోసం.. రకరకాల చాక్లెట్లు తీసుకెళ్తానంటున్న హాలీవుడ్ స్టార్ హీరో
సినిమాలు ఎంత ప్రభావం చూపిస్తాయో తెలిపే సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే...డెట్రాయిట్ కి చెందిన జాకబ్ ఓకానర్ (10) తన తమ్ముడు డైలాన్ (2) తో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంతలో అకస్మాతుగా డైలాన్ నీటిలో పడిపోయాడు. నీటమునిగి వూపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న డైలాన్ ను అతి కష్టం మీద జాకబ్ బయటకు లాగాడు. ఇంతలో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోయిన డైలాన్ ను చూసిన జాకబ్ కు ద రాక్ గా పేరొందిన హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ నటించిన ‘సాన్ ఆండ్రియాస్’ సినిమాలో అతను నీట్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సీపీఆర్ (కృత్రిమ శ్వాస అందించడం.. గుండె కొట్టుకునేలా ఛాతిపై సుతారంగా గుద్దడం) చేయడం గుర్తుకొచ్చింది.
వెంటనే తన తమ్ముడికి అలాగే చేయడం ప్రారంభించాడు. ఊపిరందిస్తూ, గుండెలపై ఒత్తిడి పెంచాడు. దీంతో డైలాన్ ఊపిరి తీసుకున్నాడు. అనంతరం స్పృహలోకి వచ్చి బతికి బయటపడ్డాడు. ఈ విషయం సోషల్ మీడియాలో జాకబ్ కుటుంబ సభ్యులు పోస్టు చేయడంతో అది డ్వేన్ జాన్సన్ ను చేరింది. దీంతో ఎంతో సంతోషించిన అతను, వచ్చేవారం జాకబ్ ను కలుస్తానని చెప్పాడు. జాకబ్ కోసం అనేక రకాల చాక్లెట్లు తీసుకెళ్తానని, అతను ఎన్నైనా తినవచ్చని తెలిపాడు.