: మరో 30 శాతం వరకూ తగ్గనున్న మొబైల్ బిల్స్... కారణమిదే!


1990వ దశకం చివర్లో సెల్ ఫోన్ వాడారా? అప్పుడు ఎంత బిల్స్ కట్టారో గుర్తుందా? అవుట్ గోయింగ్ కాల్ చేస్తే ఎస్టీడీ బిల్లులతో సమానంగా చెల్లించారు కదా? ఇన్ కమింగ్ కాల్స్ వచ్చినా నిమిషానికి పది రూపాయల వరకూ చెల్లించుకున్నారన్న విషయం మదిలో ఉందా? అయితే, అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత, టెలికం రంగ విస్తరణతో ప్రతియేటా మొబైల్ బిల్స్ తగ్గుతూ వచ్చాయి. ఇటీవలి కాలంలో ఏర్పడిన టెలికం కంపెనీల మధ్య పోటీ, డేటా, వాయిస్ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చింది.

ఇక వచ్చే సంవత్సరం 25 నుంచి 30 శాతం వరకూ ఫోన్ బిల్స్ తగ్గుతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన సంవత్సర కాలంలో బిల్స్ 25 నుంచి 32 శాతం వరకూ తగ్గగా, డేటా వాడకంపై చెల్లిస్తున్న మొత్తం ఏకంగా 60 శాతం వరకూ తగ్గింది. ఇందుకు ఓ రకంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. జియో అత్యంత తక్కువ ధరలకు సేవలందిస్తున్న వేళ, ప్రధాన పోటీదారులైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియాలు కూడా ధరలను తగ్గించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న ధరాయుద్ధంతో టెలికం కంపెనీలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, అయితే, ఈ పరిస్థితికి ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కూడా కనిపించడం లేదని కాయ్ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ రాజన్ మ్యాథ్యూస్ వ్యాఖ్యానించారు. టెలికం ఇండస్ట్రీ ఒత్తిడిలో ఉన్నా ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. 2017లో నెలసరి సగటు బిల్లు ఈ సంవత్సరం రూ. 240 నుంచి రూ. 280కి చేరిందని వ్యాఖ్యానించిన డెల్లాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ విశ్లేషకుడు హేమంత్ జోషి, ప్రస్తుతమున్న పోటీతో బిల్స్ మరింతగా తగ్గుతాయని చెప్పారు.

 ఇదే అభిప్రాయాన్ని వెల్లడించిన కన్సల్టింగ్ సేవల సంస్థ కేపీఎంజీ, మరో ఆరేడు నెలల్లో మొబైల్ బిల్స్ 30 శాతం మేరకు తగ్గుతాయని అంచనా వేసింది. కేవలం రూ. 250 నుంచి రూ. 500లోపే నెలవారీ ప్యాకేజీలను ఎన్నుకుని రోజుకు 8 గిగాబైట్ల వరకూ డేటాను వాడుకునే సదుపాయం స్మార్ట్ ఫోన్ యూజర్లకు దగ్గర కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2016లో ఒక గిగాబైట్ డేటాకు రూ. 250 వరకూ ధర ఉండగా, ప్రస్తుతం అది రూ. 50కి దిగువకు చేరిందని గుర్తు చేస్తున్నారు. జూన్ 2016లో 20 కోట్ల గిగాబైట్ల డేటాను కస్టమర్లు వాడగా, మార్చి 2017కు అది 1300 కోట్లకు చేరిందని తెలిపారు. కాగా, ధరల తగ్గింపుతో భారతీ ఎయిర్ టెల్ సంస్థ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 75 శాతం మేరకు నిరకలాభాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓడాఫోన్ ఆదాయం 8.3 శాతం తగ్గింది.

  • Loading...

More Telugu News