: ఆగని బీఆర్డీ ఆసుపత్రి మరణ ఘోష... రెండు రోజుల్లో 42 మంది చిన్నారుల మృతి!


వారం రోజుల వ్యవధిలో ఆక్సిజన్ సరఫరా లోపంతో 72 మంది చిన్నారులు మరణించిన యూపీ, గోరఖ్ పూర్ లోని బీఆర్డీ ఆసుపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆసుపత్రిలో చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట పడకపోగా, గడచిన 48 గంటల వ్యవధిలో 42 మంది కన్నుమూసి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చారు. ఆసుపత్రిలో దాదాపు ప్రతి గంటకూ ఓ చిన్నారి మృత్యువాత పడుతూ ఉండటంతో అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మెదడువాపు వ్యాధి కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించారని స్పష్టం చేసిన వైద్యులు, ఇతరత్రా వ్యాధుల వల్ల మిగతా మరణాలు సంభవించాయని, ఈ దఫా ఆక్సిజన్ లోపాలు లేవని బీఆర్డీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పీకే సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 350 మంది చిన్నారులు వివిధ రుగ్మతలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. చివరి దశలో తమ వద్దకు రావడంతోనే మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. కాగా, బీఆర్డీలో జరుగుతున్న మరణాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • Loading...

More Telugu News