: నన్ను వాళ్లు అడగలేదు... నేనే వాళ్లను అడిగాను: బాలకృష్ణ
'పైసా వసూల్' సినిమాలో 'అరె మామా ఏక్ పెగ్గులా' పాట పాడడం వెనుక కథను హీరో బాలకృష్ణ వెల్లడించారు. 'పైసా వసూల్' సినిమా షూటింగ్ సందర్భంగా తరువాత జరిగే షూటింగ్ గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్ తో చర్చించేవాడినని చెప్పారు. అలా ఆ పాట గురించి చెప్పగానే 'ఆ పాట నేనే పాడుతా'నని పూరీ జగన్నాథ్ ను అడిగానని చెప్పారు. ఎందుకంటే పాట సాహిత్యం అంతబాగా నచ్చిందని ఆయన అన్నారు. నేను అడిగిన తరువాత పూరీ 'సరే' అన్నారని ఆయన చెప్పారు. దీంతో ఆపాట పాడానని ఆయన చెప్పారు. ఆ పాట పాడేందుకు కేవలం గంట సమయం పట్టిందని ఆయన తెలిపారు. పాట కూడా అద్భుతంగా వచ్చిందని, ఆ పాటే ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోందని ఆయన అన్నారు. 'పైసా వసూల్' సినిమా కూడా పాటలాగే అద్భుతంగా ఉంటుందని ఆయన అన్నారు. కొత్తగా ట్రై చేశానని, ఈ సినిమా పండితులు, పామరులు, ధనిక, పేద, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, అభిమానులు, దురభిమానులందర్నీ అలరిస్తుందని బాలయ్య తెలిపారు.