: నేను మౌనంగా ఉండివుంటే ఇన్ఫోసిస్ కు పెను నష్టం జరిగివుండేది: నారాయణమూర్తి
తాము స్థాపించిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తిరిగి తలెత్తుకు నిలుస్తుందని, సంస్థకు తిరిగి మంచి రోజులు వస్తాయని, నందన్ నిలేకని రాకతో మంచే జరుగుతుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. సంస్థలో జరుగుతున్న అన్యాయాలు, నిర్వహణా లోపాలపై తాను నోరెత్తకుండా ఉండివుంటే పెను నష్టం జరిగి వుండేదని ఆయన అన్నారు. గత డైరెక్టర్ల బోర్డు సంస్థను విజయవంతంగా నడిపించడంలో పూర్తిగా విఫలమైందన్నది తన అభిప్రాయమని, ఇన్ఫీలో పెట్టుబడులు పెట్టిన సంస్థాగత ఇన్వెస్టర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మూర్తి వ్యాఖ్యానించారు.
ఇప్పుడిక నందన్ నిలేకని వచ్చారని, అందరమూ హాయిగా నిద్రించవచ్చని, ఆయనకు అపారమైన నిర్వహణా అనుభవం ఉందని, ఇన్ఫీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో, ప్రపంచ స్థాయి నాణ్యతతో ఎలా అభివృద్ధి చేయాలో ఆయనకు తెలుసునని చెప్పారు. నందన్ ఆధ్వర్యంలో సంస్థ మరింత ఉన్నత స్థితికి వెళుతుందని అన్నారు. కాగా, నందన్ నిలేకని కూడా ఇన్ఫీని స్థాపించిన వారిలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆధార్ ప్రాజెక్టు కోసం సంస్థను వీడిన ఆయన, సంస్థ కష్టాల్లో ఉన్న వేళ తిరిగి నాయకత్వం వహించేందుకు ముందుకు వచ్చారు.