: 'అన్నాబెల్లీ: క్రియేషన్' సినిమా చూసి అతీంద్రియ శక్తి ఉందంటూ ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి


ఇటీవల విడుదలైన హాలీవుడ్ హారర్ చిత్రం 'అన్నాబెల్లీ: క్రియేషన్' చూసిన ఇంటర్ విద్యార్థి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోల్ కతాలోని కాళీఘాట్ సమీపంలో కలకలం రేపింది. చదువులో తెలివితేటలు చూపే శ్రీజన్ చౌదరి (17) గత కొంత కాలంగా బై పోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నాడని, చికిత్స చేయిస్తున్నంతలోనే ఇంత ఘోరానికి పాల్పడతాడని ఊహించలేక పోయామని అతని తల్లిదండ్రులు వాపోయారు. తన గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకున్న శ్రీజన్, రసాయనశాస్త్రం చదువుకుంటున్నానని అమ్మకు చెప్పి, ఆపై ఉరేసుకున్నాడు.

గత వారంలో తన స్నేహితులతో కలసి స్కూల్ ఎగ్గొట్టి సినిమా చూసి వచ్చాడని, ఆపై తీవ్రమైన ఒత్తిడిలోకి పోయాడని, తన శరీరంలోకి ఆత్మలు వచ్చి పోతున్నాయని చెబుతుండేవాడని తల్లిదండ్రులు తెలిపారు. తనకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని శ్రీజన్ చెబితే తాను వారించానని, అటువంటి ఆలోచన వద్దని చెప్పానని అతని తల్లి శుక్లా చౌదరి తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. తన ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి లేఖనూ శ్రీజన్ రాయలేదని, ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలిపారు. బైపోలార్ డిజార్డర్ తో ఉన్న వారు తమకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతూ, ఒక్కోసారి ఆత్మహత్యకు పాల్పడటం సాధారణమేనని, శ్రీజన్ మరణం దురదృష్టకరమని అతనికి చికిత్సను అందించిన సైక్రియాట్రిస్ట్ జై రంజన్ రామ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News