: గుర్మీత్ అనుచరుల అల్లర్ల కారణంగా ఒంటరైన హర్మన్ ప్రీత్ కౌర్!
పంజాబ్‌లోని మోగా ప్రాంతంలో గుర్మీత్ అనుచరుల అల్లర్లను కట్టడి చేయడానికి విధించిన కర్ఫ్యూ కారణంగా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్జున అవార్డు వేడుకకు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. ఈ వేడుక కోసం బయల్దేరిన ఆమె తల్లిదండ్రులు కర్ఫ్యూ కారణంగా పంజాబ్ నుంచి ఢిల్లీ రాలేకపోయారు. `మోగాలో కర్ఫ్యూ కారణంగా నా తల్లిదండ్రులు వేడుకకు రాలేకపోతున్నారు. ఈ వేడుక కోసం వారు కొత్త వస్త్రాలు కూడా కుట్టించుకున్నారు. కచ్చితంగా వేడుకలో వాళ్ల లోటు కనిపిస్తుంది` అని హర్మన్ తెలియజేసింది.
తల్లి సత్వీందర్ కౌర్ తనతో లేని కారణంగా మరో సమస్య కూడా వచ్చిందని హర్మన్ పేర్కొంది. వేడుకకు చీరలో హాజరవాల్సి ఉండగా తనకు కట్టుకోవడం రాదని, తల్లి తనతో ఉంటే బాగుండునని అనిపించిందని హర్మన్ తెలిపింది. తనకు చీర కట్టుకోవడంలో బాస్కెట్‌బాల్‌లో అర్జున అవార్డుకు ఎంపికైన ప్రశాంతి సింగ్ తల్లి సహాయం చేసిందని హర్మన్ చెప్పింది. తను మినహా మిగతా ఆటగాళ్లందరూ తమ తల్లిదండ్రులతో హాజరవడం చూసి చాలా బాధ కలిగిందని హర్మన్ తెలియజేసింది.