: నా ప్రాణాలు పోతే.. ఆ బాధ్యతను పవన్ తీసుకుంటారా? లేక బండ్ల గణేష్ తీసుకుంటారా?: కత్తి మహేష్ సూటి ప్రశ్న
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను బూతులు తిడుతూ, బెదిరిస్తున్నారని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ అన్నారు. తనకు ముప్పు పొంచి ఉందని, ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ పై పోలీస్ స్టేషన్లో తప్పకుండా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పవన్ ఫ్యాన్స్ ని తాను అర్థం చేసుకోగలనని... వాళ్లు దేవుడగా భావించే పవన్ ను ఎవరైనా ఏమైనా అంటే... దాన్నుంచి ఆయనను రక్షించుకునే ప్రయత్నం ఫ్యాన్స్ చేస్తారని... అయితే, తనను వారు హెచ్చరిస్తున్న తీరులో హింసాత్మకధోరణి కనపడుతోందని అన్నారు.
తనను కొడతామంటూ, చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని తెలిపారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా తనను మాడ్చేస్తానని హెచ్చరించారని... ఒక వ్యక్తిని హెచ్చరించే సమయంలో ఉపయోగించే భాష చాలా ముఖ్యమని చెప్పారు. ఒకవేళ ఈ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ స్పూర్తి పొంది, తనను నిజంగా మాడ్చేస్తే... ఆ బాధ్యతను పవన్ తీసుకుంటారా? లేక బండ్ల గణేష్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
గతంలో 'కాటమరాయుడు' సినిమాపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. అప్పట్నుంచి కత్తి మహేష్ ను టార్గెట్ చేస్తూ, సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో, పవన్ ఫ్యాన్స్ నుంచి తనకు దాదాపు 10 వేల బెదిరింపు కాల్స్ వచ్చాయని మహేష్ చెప్పారు. సమాజంలో విష సంస్కృతి పెంచి పోషించవద్దని కోరారు.