: నంద్యాలలో డబ్బులు పంచారంటూ.. హైకోర్టులో హీరో బాలకృష్ణపై పిటిషన్!
ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో హిందూపురం శాసనసభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచి పెట్టారని, దీనిపై చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలని వైకాపా ప్రధాన కార్యదర్శి కే శివకుమార్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, నంద్యాల రిటర్నింగ్ అధికారి, బాలకృష్ణలను ఆయన ప్రతివాదులుగా చేర్చారు.
ఓటర్లను ప్రలోభ పెట్టాలని బాలకృష్ణ చూశారని, డబ్బు పంచుతున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయని తెలిపారు టీవీ చానళ్లు వీడియోలు చూపగా, పత్రికలు ఫోటోలు ప్రచురించాయని, ఈ విషయమై ఇంతవరకూ కేసు నమోదు కాలేదని గుర్తు చేశారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకమైన ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ప్రచారంలో బాలకృష్ణ పంచింది డబ్బు కాదని, కరపత్రాలు మాత్రమేనని కలెక్టర్ నుంచి తనకు నివేదిక అందినట్టు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.