: శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ.. మూడో వన్డేలో కెప్టెన్ నిర్ణయంపై విచాణకు ఆదేశం!


మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదేనేమో!.. స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుస ఓటములతో కుంగిపోయిన శ్రీలంకకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ లంక జాతీయ సెలక్టర్లు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమైన కాసేపటికే మూడో వన్డేకు నాయకత్వం వహించిన చమర కపుగెదెరపై బోర్డు విచారణకు ఆదేశించింది. ఆదివారం పల్లెకెలెలో జరిగిన మూడే వన్డేలో జట్టు నిర్ణయానికి వ్యతిరేకంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై బోర్డు విచారణకు ఆదేశించింది.

రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు వన్డేల నిషేధం పడడంతో కపుగెదరకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. వరుసగా ఐదు టాస్‌లు గెలిచిన భారత్ మూడో వన్డేలో మాత్రం టాస్ ఓడింది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కపుగెదెర బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్‌కు ముందు జరిగిన జట్టు సమావేశంలో టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలని, ఛేజింగ్ చేసి సత్తా చాటాలని సమావేశంలో నిర్ణయించారు.

అందుకు భిన్నంగా, టాస్ గెలిచిన సారథి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 217 పరుగులను మహా కష్టం మీద చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తప్పుడు నిర్ణయం తీసుకున్న కపుగెదరపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News