: వీసా ఇప్పిస్తానని చెప్పి మహిళపై అత్యాచార యత్నం.. వీసా ఏజెంట్ అరెస్టు!
ఓ మహిళపై అత్యాచారయత్నం చేయబోయిన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వీసా ఏజెంట్ కరీముద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి చార్మినార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ వితంతువు జీవనోపాధి నిమిత్తం తన ఇద్దరు పిల్లలతో కలిసి గల్ఫ్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. దాదాపు ఇరవై ఐదు రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చింది.
పాస్ పోర్టు సంపాదించుకున్న ఆమె, వీసా సంపాదించే ప్రయత్నాల్లో భాగంగా ఏజెంట్ కరీముద్దీన్ ని కలిసింది. ఆమెతో వీసాకు సంబంధించిన విషయాలు మాట్లాడటానికి బదులు, తన కోరిక తీర్చాలంటూ ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. మొత్తానికి, అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు చార్మినార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్టు డీసీపీ సత్యనారాయణ చెప్పారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని మోసం చేస్తూ, వారిపై వేధింపులకు పాల్పడుతున్న ఏజెంట్లను పట్టుకునేందుకు రెండు బృందాలు పని చేస్తున్నట్టు చెప్పారు.