: ఆకలితో ఉన్న నాకు జూ.ఎన్టీఆర్ అన్నం తెచ్చివ్వగానే ఆనాడు భావోద్వేగానికి గురయ్యాను!: పరుచూరి గోపాలకృష్ణ
హిందీలో ఎప్పటినుంచో బిగ్‌బాస్ షో ఉంది కానీ, తాను ఎప్పుడూ దాన్ని చూడలేదని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. తన యూట్యూబ్ ఖాతాలో 'పరుచూరి పలుకులు' పేరిట ప్రతి మంగళవారం తన అభిప్రాయాలు, అనుభవాలను పంచుకుంటున్న గోపాలకృష్ణ ఈ రోజు మాట్లాడుతూ.. తాను ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ బాస్ షోను చూస్తున్నానని తెలిపారు. తాను కూడా గతంలో ప్రజా వేదిక అనే షోను ఐదేళ్లు చేశానని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ 12 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఓ సారి తన కంట నీళ్లు తిరిగేలా చేశాడని తెలిపారు. బిగ్ బాస్ షో లో ఆ కవ్వింపులు, లాలింపులు చూస్తుంటే నాడు చూసిన మా చిన్న రామయ్యేనా ఈ ఎన్టీఆర్? అనిపించిందని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ పిల్లల్లో తనకు మొట్టమొదట నందమూరి హరికృష్ణ పరిచయం అయ్యారని గోపాలకృష్ణ అన్నారు. హరికృష్ణ తనను ప.గో అని పిలుస్తారని అన్నారు. ఆయన కుమారుడు ఎన్టీఆర్‌తో కూడా తనకు ఓ అనుభవం ఉందని చెప్పారు. బాలరామాయణం సినిమా చిత్రీకరణ సమయంలో రైల్లో వెళుతున్నామని, అప్పుడు ఎన్టీఆర్ కి 12 ఏళ్లు ఉండొచ్చని అన్నారు. ఆ పిల్లాడు అచ్చం పెద్ద ఎన్టీఆర్ లాగే ఉన్నాడని తాను మొదట చూసినప్పుడు అనుకున్నానని చెప్పారు. రైల్లో క్యాటరింగ్ సౌకర్యం ఒక్కసారిగా ఆగిపోయిందని, ఏం చేయాలో తెలియక ఆకలితో మాడిపోతోంటే ఆ చిన్నారి ఎన్టీఆర్ ఒక బాక్స్ తీసుకొచ్చి తనకు ఇచ్చి అది తినమన్నాడని చెప్పారు. మరి నీకు? అని తాను అడిగానని, దానికి ఎన్టీఆర్ అమ్మ తనకు మరో బాక్సు ఇచ్చిందని అన్నాడని చెప్పారు.
ఎన్టీఆర్ ఆ బాక్స్ తన చేతికి ఇవ్వగానే తన కళ్లలో నీళ్లు తిరిగాయని, భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. పన్నెండేళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ లో అన్నగారు కనిపించారని అన్నారు. తెలుగు బిగ్‌బాస్‌షో తనకు బాగా నచ్చిందని తెలిపారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఇప్పుడు ఏ కుటుంబంలోకి వెళ్లినా భార్యాభర్తలు, ఒకరిద్దరు పిల్లలు మాత్రమే కనపడుతున్నారని ఆయన చెప్పారు.
ఏమాత్రం రక్త సంబంధం లేని వారిని బిగ్ బాస్ హౌస్ కి తీసుకొచ్చి, 70 రోజుల పాటు వారికి తెలియని ప్రేమాభిమానాలను వారిలో పుట్టిస్తున్నారని అన్నారు. బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా ఉన్న చిన్న రామయ్యను చూడడానికి తాను ఎంతో ఉత్సాహం చూపిస్తున్నానని అన్నారు. ఒక రియాలటీ షో నడపడానికి ఎంతో సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం ఉండాలని, ఎన్టీఆర్ ఎంతో చక్కగా నిర్వహిస్తున్నాడని కితాబిచ్చారు. ఈ షో మనుషుల మధ్య అనుబంధాల్ని, ఆత్మీయతలను పెంపొందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.