: నేను గుర్మీత్ బాబాకి మద్దతుగా మాట్లాడలేదు: సాక్షి మహరాజ్
అత్యాచారం కేసులో దోషిగా తేలి ఇరవై ఏళ్ల జైలు శిక్షకు గురైన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ను బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వెనకేసుకొచ్చిన విషయం తెలిసిందే. గుర్మీత్ బాబాకు మద్దతుగా లక్షల మంది నిలిచారని, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే, కుట్రపూరితంగా ఇటువంటి ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చారని సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించినట్లు వార్తల్లో వచ్చింది. తాజాగా ఈ రోజు ఇదే విషయంపై స్పందించిన సాక్షి మహరాజ్ మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచురించిందని అన్నారు. తాను గుర్మీత్ సింగ్ బాబాకి మద్దతుగా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.
గుర్మీత్ సింగ్ కు శిక్ష ఖరారు చేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానని సాక్షి మహరాజ్ అన్నారు. ఈ తీర్పు విశ్వాసం పేరుతో మోసం చేసిన వారిపై విజయం సాధించడం లాంటిదని అన్నారు. బాబా రామ్ పాల్, బాబా రామ్ రహీమ్, బాబా ఆశారామ్ వంటి వారు సన్యాసులు కాదని, ఇటువంటి వారిని అనుసరించే ముందు భక్తులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు.