: అమెరికాకు ఝలక్ ఇచ్చిన పాక్...అమెరికా అధికారిని ఇప్పుడు పాక్ పంపొద్దంటూ సూచన!
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంపై ఆ దేశం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాకు పాక్ ఝలక్కిచ్చింది. ట్రంప్ వ్యాఖ్యల కారణంగా అమెరికాతో ద్వైపాక్షిక చర్చలను, ఆ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు పాకిస్థాన్ పత్రిక ద నేషన్ తెలిపింది. ట్రంప్ ప్రకటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ సెనేట్ కమిటీకి విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారని ద నేషన్ తెలిపింది. అదే సమయంలో అమెరికా సీనియర్ అధికారి పర్యలనను రద్దు చేసుకోవాలని పాక్ కోరినట్టు ద నేషన్ వెల్లడించింది.
ట్రంప్ వ్యాఖ్యల అనంతరం పాక్ లోని అన్ని వర్గాల నుంచి అమెరికాపై వ్యతిరేకత పెరిగిందని, కరాచీలో ఆందోళనలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో పాక్ పర్యటనను రద్దు చేసుకోవాలని ఖవాజా ఆసిఫ్ సూచించినట్టు తెలిపింది. ఇరు దేశాలకు అనుకూలమైన సమయంలో ఈ పర్యటన పెట్టుకోవాలని పాక్ సూచించింది. కాగా, ఇస్లామాబాద్ లో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక ఉపకార్యదర్శి అలైస్ వేల్స్ పర్యటించాల్సి ఉంది. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికన్ పౌరులను చంపుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని, పాక్ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిందని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిర్ణయం వెనుక చైనా వ్యూహం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.