: ముంబైకి హెచ్చరిక... 2005 నాటి 'టైఫూన్' తిరిగొస్తోంది!
దాదాపు పుష్కర కాలం క్రితం ముంబై మహానగరాన్ని వణికించిన పెను తుపాను టైఫూన్ గుర్తుందా? జూలై 26, 2005న ముంబై నగరంపై వరుణుడు ఆగ్రహాన్ని చూపుతూ కుంభవృష్టిని కురిపించగా, ప్రజలు అల్లాడిపోయారు. నాటి వరదలను కేంద్రం జాతీయ విపత్తుగానూ గుర్తించింది. తిరిగి ఇప్పుడు అదే తరహా వర్ష బీభత్సం నగరాన్ని అతలాకుతలం చేయనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షం మరో 48 గంటల పాటు పడుతుందని, నగరవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని తెలిపారు. కాగా, ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పట్టాలపైకి నీరు చేరడంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. ప్రజలు ముందుగానే జాగ్రత్త పడాలని పలువురు ప్రముఖులు తమ ట్విట్టర్ ఖాతాల్లో తెలిపారు.
నేడే ఆహార పదార్థాలను ఇళ్లలోకి చేరవేసుకోవాలని, ఫోన్లు పూర్తిగా చార్జింగ్ పెట్టుకోవాలని, అవసరమైతేనే బయటకు రావాలని పలువురు సలహాలు ఇస్తున్నారు. కాగా, నేడు ఢిల్లీలో ఆస్ట్రేలియా స్నేహితులతో తాను సమావేశం కావాల్సి వుందని చెప్పిన మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎండీ, ఆనంద్ మహీంద్రా వర్షం కారణంగా నీటిలో చిక్కుకు పోయానని, తాను ఢిల్లీ వెళ్లాల్సిన విమానం కూడా రద్దయిందని ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.