: మూడో బిడ్డకు తండ్రయిన ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్!


వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మూడో బిడ్డకు తండ్రయ్యాడు. ఆయన సతీమణి రి సోల్ జు ఇటీవల మూడో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియాకు చెందిన యాన్ హప్ అనే న్యూస్ ఏజెన్సీ నేడు ప్రకటించింది. ఈ ఫిబ్రవరిలో రి సోల్ మూడో బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపింది. దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ ద్వారా ఈ విషయం కొందరు మంత్రులకు తెలిసిందని వెల్లడించింది.

2009లో కిమ్, సోల్ ల వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా రి సోల్ అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియాను పాలించిన కిమ్ వంశీయుల్లో కిమ్ జాంగ్ మూడో తరానికి చెందిన వ్యక్తి. వీరి కుటుంబానికి సంబంధించిన విషయాలు అత్యంత గోప్యంగా ఉంటాయి.

 కిమ్ తండ్రి, తాతలు ఏనాడూ తమ కుటుంబాన్ని బయటకు తీసుకురాలేదు. కిమ్ జాంగ్ మాత్రం ఆ సంప్రదాయానికి ముగింపు పలికి, తన భార్యను తనతో పాటే కొన్ని అధికారిక కార్యక్రమాలకు తీసుకొచ్చారు. వాస్తవానికి కిమ్ జాంగ్ కు సంబంధించిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో బయటి ప్రపంచానికి తెలియదు. ఆయన వివాహం జరిగిన తేదీ కూడా ఇప్పటి వరకు గోప్యంగానే ఉంది. ఆయనకు పిల్లలు పుట్టిన విషయం కూడా విశ్వసనీయ వర్గాల ద్వారానే బయటకు తెలిసింది. 

  • Loading...

More Telugu News