: కూతురిని హత్య చేసి, మేకప్ తో బయటకు వచ్చిన మహిళ... చితగ్గొట్టిన స్థానికులు!
కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న బిడ్డను దారుణంగా హత్య చేయడంతో పాటు, ఆపై ఏమీ జరగనట్టుగా మేకప్ వేసుకుని, ముస్తాబై బయటకు వచ్చిన ఓ మహిళను స్థానికులు చితగ్గొట్టి, పోలీసులకు అప్పగించిన సంఘటన బెంగళూరులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పుట్టేనహళ్ళి ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కాంచన్ సర్కార్, ఆయన భార్య స్వాతి నివాసం ఉంటున్నారు. కాంచన్ ఐటీ ఉద్యోగి కాగా, స్వాతి హిందీ టీచర్. వీరికి ఏడు సంవత్సరాల పాప శ్రేయా ఉంది. ఆమెకు మాటలు రావు. కొంతకాలం క్రితం మనస్పర్థలు రావడంతో కాంచన్, భార్యకు దూరంగా మరో ఇంట్లో ఒంటరిగా ఉంటూ, అప్పుడప్పుడూ వచ్చి పోతుండేవాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తన కుమార్తె శ్రేయాను మూడో అంతస్తుకు తీసుకెళ్లిన స్వాతి, అక్కడి నుంచి నిర్దయగా కింద పడేసింది. ఆపై తాపీగా కిందకు వచ్చి, ప్రాణాలు పోలేదని తెలుసుకుని మరోసారి పాపను పైకి తీసుకెళ్లి కింద పడేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించగా, ఏమీ తెలియనట్టు ఇంట్లోకి వెళ్లి టిప్పుటాపుగా తయారై బయటకు వచ్చింది. కుమార్తె మృతదేహాన్ని పట్టించుకోకుండా బయటకు ఎక్కడికని స్థానికులు ప్రశ్నించగా, నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చింది. దీంతో వారంతా ఆమెను కరెంటు స్తంభానికి కట్టేసి, చావగొట్టి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో స్వాతి తన కుమార్తెను హత్య చేయాలని నిర్ణయించుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.