: 'కారు'చౌక బేరం: 34 లక్షల విలువైన మాల్యా కార్లను 1.8 లక్షలకే సొంతం చేసుకున్న కర్ణాటక వాసి
9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామంపెట్టి దేశం దాటిపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యజమాని విజయ్ మాల్యా ఆస్తుల వేలం ఒక్కొక్కటిగా కొనసాగుతోంది. తాజాగా ఆయనకు సంబంధించిన 34 లక్షల రూపాయల విలువైన రెండు లగ్జరీ కార్లను వేలం వేయగా, వాటిని హుబ్లీకి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యాపారవేత్త 1.8 లక్షల రూపాయలకు కారు చౌకగా కొనుగోలు చేయడం విశేషం. ముంబై నుంచి బ్యాంకుల కన్సార్టియం ఈ వేలం వేయగా, 21 లక్షల విలువైన హోండా ఎకార్డ్ కారును 1.4 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. అలాగే 13.15 లక్షల విలువైన సొనాటా గోల్డ్ కారును కేవలం 40,000 రూపాయలకు ఆయన సొంతం చేసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆన్ లైన్ వేలంలో మొత్తం 52 కార్లు ఉన్నాయని చెప్పారు. రోల్స్ రాయిస్ వంటి కార్లకు పోటీ ఎక్కువ ఉందని, తాను కొనుగోలు చేసిన కార్ల కోసం అంత పెద్ద పోటీ లేదని అన్నారు. రెండు కార్లు మంచి కండిషన్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడు కొనుగోలు చేసిన ధరకు రెండింతలు ఇస్తాం ఇచ్చేయండంటున్న ప్రతిపాదనలు ఎక్కువ అవుతున్నాయని ఆయన తెలిపారు.