: నంద్యాలలో ప్రజా తీర్పును గౌరవిస్తాం: బొత్స సత్యనారాయణ
నంద్యాలలో ప్రజా తీర్పును గౌరవిస్తామని, అయితే, టీడీపీ ప్రలోభాలకు పాల్పడి గెలిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరమని చెప్పారు. ఎన్నిక తరువాత ఓ టీడీపీ నేత రోడ్డు మీద మారణాయుధాలతో రెచ్చిపోతే కూడా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. చంద్రబాబుకి భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఓటు వేయకపోతే ఇబ్బందుల పాలు చేస్తామని ప్రజలను బెదిరించారని ఆరోపించారు. ఓటు వేయకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు తమకు అందకుండా పోతాయేమోనని ప్రజలు భయపడ్డారని అన్నారు. ఇటువంటి వారికి భవిష్యత్తులో ఓటమి తప్పబోదని చెప్పారు.