: తమిళ బిగ్‌బాస్‌కు అతిధిగా మహేశ్ బాబు?
సరాసరి తమిళంలో మొదటిసారి విడుదలవుతున్న తన చిత్రం `స్పైడర్` ప్రచారం కోసం మహేశ్ బాబు తమిళ బిగ్‌బాస్ కార్యక్రమానికి అతిధిగా వెళ్లనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దసరా సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి తమిళనాడులో పెద్దఎత్తున ప్రచారం కల్పించడానికి మహేశ్ బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో సినిమా ప్రచారం కోసం ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడంపై సినీ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం తెలియరాలేదు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న `స్పైడర్` చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. అలాగే హిందీ, మలయాళం, అరబిక్ భాషల్లోకి కూడా అనువాదం చేశారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆడియో సెప్టెంబర్ 8న, చిత్రం సెప్టెంబర్ 27న విడుదలకానున్నాయి.