: ఏ దశలోనూ కోలుకునే విధంగా కనిపించని శిల్పా మోహన్ రెడ్డి!
నంద్యాల రూరల్ లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించింది. నంద్యాల రూరల్ మండలం ఓట్లను తొలుత ఐదు రౌండ్లలో లెక్కించగా, ఐదు రౌండ్లలోనూ భూమా బ్రహ్మానందరెడ్డికి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. ఏ రౌండ్ కు ఆ రౌండ్ లో తమ నేత శిల్పా మోహన్ రెడ్డి పుంజుకుంటారని వైకాపా కార్యకర్తలు అంచనా వేస్తూ రాగా, రూరల్ కౌంటింగ్ ముగిసేసరికి సుమారు 13 వేల ఓట్ల ఆధిక్యంలోకి భూమా దూసుకెళ్లారు. తొలి రౌండ్ లో 1,198 ఓట్ల మెజారిటీని సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డి, ఆపై రెండో రౌండ్ లో 1,762, మూడో రౌండ్ లో 3,113, నాలుగౌ రౌండ్ లో 3,597 ఓట్ల మెజారిటీని సాధించారు. ఐదో రౌండ్ లోనూ భూమా ఆధిక్యం మరింతగా పెరిగింది. ఇప్పటివరకూ టీడీపీకి 31,062 ఓట్లు, వైకాపాకు 17,984 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 278 ఓట్లకు పరిమితమైంది. ఈ స్థాయిలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించగా, శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.