: వన్డే సిరీస్ భారత్ కైవసం.. మూడో వన్డేలోనూ ఓడిన లంక!

టెస్ట్, వన్డే సిరీస్ కోసం శ్రీలంక గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయగా తాజాగా వన్డే సిరీస్‌నూ గెలుచుకుంది. ఆదివారం పల్లెకెలెలో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్లతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి భారత్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది.

218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 29 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం (145 బంతుల్లో 16  పోర్లు, 2 సిక్సర్లు)తో రాణించగా, మిస్టర్ కూల్ ధోనీ 67 పరుగులు (86 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో) చేసి జట్టుకు మరో విజయాన్ని అందించారు. లంక బౌలర్లలో అకిల ధనంజయ రెండు వికెట్లు తీయగా, మలింగ, ఫెర్నాండో చెరో వికెట్ తీశారు.

 అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెప్టెన్ మారినా ఆటతీరులో మాత్రం మార్పు కనిపించలేదు. భారత బౌలర్ బుమ్రా దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. 27 పరుగులకే 5 వికెట్లు నేలకూల్చిన బుమ్రా శ్రీలంక పతనాన్ని శాసించాడు. లంక బ్యాట్స్‌మన్లలో లహిరు తిరిమన్నె 80 పరుగుల(105 బంతుల్లో 5  ఫోర్లు, సిక్సర్)తో రాణించాడు. దినేష్‌ దినేశ్ చండీమల్ (36), మిలింద సిరివర్దన (29) పరవాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలమయ్యారు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News