: ఇస్లాం మతంలోకి మారిన యువతికి అండగా ‘పాక్’ కోర్టు!
హిందూమతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన ఓ యువతికి పాకిస్థాన్ కోర్టు అండగా నిలబడింది. ఇస్లామాబాద్ లో ఓ హిందూ యువతి అనూషి ముస్లిం మతం స్వీకరించి మారియాగా మారి ముస్లిం యువకుడిని వివాహమాడింది. అనంతరం, తన కుటుంబీకుల నుంచి ప్రాణాపాయం ఉందంటూ మారియా, తన భర్త బిలావల్ అలీ భుట్టోతో కలిసి హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా, ఈ కేసును ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది.
తమ కూతురిని అపహరించి బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చారని తర్వాత ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించారని మారియా కుటుంబం ఆరోపించింది. అయితే, తనను మతం మార్చుకోమని ఎవరూ బలవంతం చేయలేదని న్యాయమూర్తికి ఆ యువతి తెలిపింది. అరబిక్ భాషలో ప్రార్థనలు చేసి ఇస్లాం మతంలోకి తాను ఇష్టపూర్వకంగానే మారినట్టు చెప్పింది. దీంతో మారియా, తన భర్తతో కలిసి జీవించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది.
ఆ దంపతులకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీస్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తమ కూతుర్ని భర్త కొన్నాళ్లకు వదిలి వేయవచ్చని, ఎలాగైనా మారియాను తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు కోర్టుకు విన్నవించారు. అందుకు, కోర్టు నిరాకరించింది. ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తే తిరిగి మారియాను హిందూమతంలోకి మారమని బలవంతం చేయొచ్చని, అంతేకాకుండా, మారియా ప్రాణాలకు అపాయం వాటిల్లే అవకాశముందని కోర్టు అభిప్రాయపడింది.